న్యూఢిల్లీ, జూలై 16: దేశంలోని ఉన్నత విద్య మొత్తాన్ని ఒకే సంస్థ పరిధిలోకి తేవాలన్న లక్ష్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాదే ఆచరణలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూతన విద్యా విధానం (ఎన్ఈపీ-2020)లో ప్రతిపాదించిన భారత ఉన్నత విద్యామండలి (హెచ్ఈసీఐ) మూసాయిదా బిల్లుకు కేంద్రం తుది రూపు ఇచ్చినట్టు సమాచారం. దీనిని నేడో, రేపో కేంద్ర క్యాబినెట్ ఆమోదించి, సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం యూనివర్సిటీల నియంత్రణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), సాంకేతిక విద్యా నియంత్రణకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), ఉపాధ్యాయ విద్యా నియంత్రణకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఉన్నాయి. ఈ మూడు సంస్థలను విలీనం చేసి హెచ్ఈసీఐని ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది. హెచ్ఈసీఐ ముసాయిదాకు యూజీసీ తుది రూపు ఇస్తున్నట్టు సమాచారం. ‘హెచ్ఈసీఐ ముసాయిదా రూపొందించే పనిలోనే ఉన్నాం. ఈ సంస్థ నిర్మాణం ఎలా ఉండాలన్నదానిపై సంబంధిత వర్గాలతో చర్చించి అభిప్రాయాలు సేకరిస్తున్నాం’ అని యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్‌కుమార్ తెలిపారు.
యాంటీ ట్రాఫికింగ్‌తో సహా 24 బిల్లులు సిద్ధం
సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 24 బిల్లులు ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కారు సిద్ధం చేసింది. వీటిల్లో ప్రధానంగా మహిళలు, చిన్నారుల ట్రాఫికింగ్ నియంత్రణకు సంబంధించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక బిల్లు, స్మారకాల కట్టడాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇతర నిర్మాణాలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ కొత్త నిబంధనలు తెచ్చేందుకు ఉద్దేశించిన ఆనిసెంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్(సవరణ) బిల్లు, అక్రమ ఆయుధాల ఫండింగ్పై నిషేధానికి సంబంధించిన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ సవరణ బిల్లు ఇందులో ఉన్నాయి.