Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులోని ఇద్దరు నిందితులను సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్ చెల్లుబాటుపై ప్రశ్నలు లేవనెత్తింది. రెమిషన్ (శిక్ష తగ్గింపు) పిటిషన్‌పై తీర్పును వెలువరించే వరకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు రాధేశ్యామ్ భగవాన్‌దాస్ అలియా లాలా వకీల్, రాజుభాయ్ బాబులాల్ సోనీలు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
2002 గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబం హత్యకు గురైంది. ఐదునెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ క్రమంలో 14 సంవత్సరాలుగా యావజ్జీవం అనుభవిస్తున్న నిందితులకు గుజరాత్ ప్రభుత్వం రెమిషన్‌పై విడుదల చేసింది. నిందితులంతా 2022 ఆగస్టు 15న జైలు నుంచి విడుదలయ్యారు. సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు.. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. నిందితుల విడుదల చెల్లదంటూ ఈ ఏడాది జనవరిలో తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. నిందితులంతా జైలులో లొంగిపోవాలని ఆదేశించింది.
అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ రాధే శ్యామ్, రాజుభాయ్ ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము దాఖలు చేసిన రెమిషన్ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించే వరకు తాత్కాలికంగా విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. అయితే, విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను తప్పుపట్టింది. కోర్టులో ఓ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై మరో బెంచ్‌లో ఎలా అప్పీల్ చేశారని ప్రశ్నించింది. దాంతో నిందితులు పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరారు. ఇందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.