న్యూఢిల్లీ, జనవరి 18: కోర్టు ముందు లొంగిపోవడానికి తమకు మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని బిల్కిస్ బానో కేసు దోషులు సుప్రీం కోర్టును అభ్యర్థించారు. బిల్కిస్ బానో కేసులో 11 మంది ఖైదీలకు శిక్షాకాలం పూర్తి కాకుండానే గుజరాత్ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను రద్దు చేస్తూ రెండు వారాల్లో వారిని తిరిగి జైలుకు పంపాలని సుప్రీం కోర్టు ఈ నెల 8న తీర్పు చెప్పింది.
ఈ గడువు ఆదివారంతో ముగియనుండటంతో దోషుల్లో ఐదుగురు అనారోగ్యం, సర్జరీ, కుమారుని వివాహం, పంటల కోత వంటి కారణాలను చూపుతూ లొంగిపోవడానికి తమకు మరికొన్ని రోజుల గడువు మంజూరు చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తి జస్టిస్‌లు బీవీ నాగరత్న, సంజయ్ కరోల్ బెంచ్ ముందుకు రాగా, ఆ దరఖాస్తుల ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు ఉంచాలని వారు ఆదేశించారు.