న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 : ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ ఓటర్ల కోసం ఆధునిక టెక్నాలజీతో కూడిన ఓటరు గుర్తింపు కార్డులు అందచేయడానికి ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలు పూర్తయి సెప్టెంబర్ 30న తుది జాబితా ప్రచురించిన తర్వాత అప్గ్రేడ్ చేసిన ఓటరు గుర్తింపు కార్డులు జారీచేసే ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతం ఓటర్ల వద్ద ఉన్న ఫొటో గుర్తింపు కార్డులకు(ఎపిక్) అదనపు సాంకేతిక హంగులను ఎన్నికల కమిషన్ కల్పించనున్నది.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సందర్భంగా ఓటర్లు సమర్పించిన తాజా ఫొటోలతోపాటు పటిష్టమైన రక్షణ చర్యలతో కొత్త కార్డులను ఈసీ జారీ చేయనున్నది. ఎపిక్ కార్డులకు క్యూఆర్ కోడ్ను అదనంగా చేర్చడం ఓ ముఖ్యాంశంగా ఈసీ తెలిపింది. డూప్లికేషన్ లేదా ఫోర్జరీకి దీని వల్ల ఆస్కారం ఉండదని ఈసీ పేర్కొంది. ఈ డిజిటల్ కార్డును ఓటర్లు తమ స్మార్ట్ఫోన్లు లేక కంప్యూటర్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటింగ్ సమయంలో ఓటరు కార్డు, డిజిటల్ కార్డు రెండూ చెల్లుబాటు అవుతాయి.