పాట్నా: బీజేపీ పాలిత బీహార్‌లో టీచర్లకు వీధి కుక్కల లెక్కింపు, పర్యవేక్షణ పనులు అప్పగించటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. స్కూల్లో పాఠ్య ప్రణాళిక, అటెండెన్స్ రిజిస్టర్‌తోపాటు, ఇప్పుడు వీధుల్లో కుక్కలు ఎన్ని ఉన్నాయన్న లెక్క కూడా టీచర్ల వద్ద ఉండాల్సిందే! బీహార్‌లోని ససారామ్ మున్సిపల్ కార్పొరేషన్ జారీచేసిన ఆదేశాల ప్రకారం, మున్సిపల్ పరిధిలోని అన్ని స్కూల్స్ ఓ నోడల్ అధికారిని నియమించి.. చుట్టుపక్కల ప్రాంతాల్లో కుక్కల సంఖ్యను తేల్చాలి.
టీచర్‌గా స్కూల్లో విధులు నిర్వహిస్తూనే ఈ పని పూర్తిచేయాలి. నిర్దేశిత ప్రాంతంలో ఎన్ని కుక్కలు ఉన్నాయి? పరిస్థితిని ఎలా నియంత్రిస్తున్నారు? అన్నదానిపై మున్సిపల్ కార్పొరేషన్‌కు ఒక నివేదిక కూడా సమర్పించాల్సి ఉంటుంది. టీచర్లకు విద్యతో సంబంధం లేని పనులను అప్పగించటం చర్చనీయాంశమైంది.