పాట్నా, అక్టోబర్ 9: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్‌కుమార్‌కు వచ్చే నెలలో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. బీహార్‌కు తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ దాదాపు రెండు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నారు. అయితే తన పాలనా కాలమంతా కొన్నేండ్లు ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో మరికొన్నేండ్లు ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో కొనసాగింది. దీంతో ఆయన ‘యూ’టర్న్‌ల ముఖ్యమంత్రిగా పేరుపొందారు. 1998లో ఎన్డీయే కూటమి ఏర్పడిన తరువాత బీహార్‌లో నాలుగుసార్లు (ఫిబ్రవరి 2005, అక్టోబర్ 2005, 2010, 2020) ఎన్నికలు జరిగాయి. కాగా ఆయన ఏ కూటమిలో ఉన్నా తానే తదుపరి ముఖ్యమంత్రిగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయన వయస్సు 74 ఏండ్లు కాగా ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, ఆయన ఆరోగ్య పరిస్థితి, ప్రజలు మార్పు కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరిగేవే ఆయనకు చివరి ఎన్నికలు కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నడూలేని విధంగా ఈసారి నితీశ్‌కుమార్ తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆయన అధికారంలో కొనసాగడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాలలో ఆయన పాలన పట్ల విరక్తి వ్యక్తమవుతున్నది. ఇదే పరిస్థితిని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం ఎదుర్కొన్నారు. సుమారు 24 ఏండ్లకుపైగా అధికారంలో కొనసాగిన నవీన్ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొనేందుకు నితీశ్ ప్రభుత్వం ఇటీవల మహిళలకు, యువతకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేసింది. అయినప్పటికీ తన ‘వికాస్ పురుష్’ ఇమేజ్ను నిలుపుకోగలరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలి కాలంలో నితీశ్‌కుమార్ తీవ్ర అలసటకు గురవడమే కాకుండా కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో బహిరంగ కార్యక్రమాల్లో అభాసుపాలవుతున్నారు. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జన్‌సూరజ్ నేత ప్రశాంత్ కిషోర్ తదితరులు ముఖ్యమంత్రి సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆయన భౌతికంగా, మానసికంగా రాష్ర్టాన్ని ముందుకు నడిపించే స్థితిలో లేరని వ్యాఖ్యానిస్తున్నారు.
నితీశ్‌కుమార్ రాజకీయ జీవితమంతా యూటర్న్లమయంగానే కొనసాగింది. ఆయన ఇటు ఎన్డీయే, అటు మహాఘట్‌బంధన్‌ల మధ్య కూటములు మారినప్పటికీ రెండు దశాబ్దాలపాటు అధికారంపై మాత్రం తన పట్టును కొనసాగించగలిగారు. అయితే కూటములు మారే ఆయన వైఖరి గత కొన్నేండ్లుగా ప్రజల మధ్య విశ్వసనీయతను దెబ్బతీసింది. జేడీయూ పార్టీ 2010లో 115 సీట్లు గెలుచుకోగా, 2015 నాటికి ఆ సంఖ్య 71 సీట్లకు తగ్గింది. ఇక 2020లో కేవలం 43 సీట్లు మాత్రమే గెలుపొందింది. నితీశ్ పార్టీ కోల్పోయిన స్థానాలలో అత్యధికంగా బీజేపీ కైవసం చేసుకుంది. నితీశ్ పతనం బీజేపీకి రాజకీయంగా బలంగా మారింది.
రాజకీయ నాయకునిగా మారిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్‌సురాజ్ పార్టీ పేరిట ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మద్యంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న మద్య నిషేధం ఒక బూటకమని, ఆర్థికంగా రాష్ర్టానికి ఎంతో నష్టం జరుగుతున్నదని ఆయన అంటున్నారు. నితీశ్ మళ్లీ సీఎం కాలేరని జోస్యం చెప్తున్నారు. ఓటర్ల జాబితా సవరణలో 22.7 లక్షల మంది మహిళా ఓటర్ల పేర్లను తొలగించారు. ఆ మేరకు మహిళల మద్దతు నితీశ్‌కు పోయినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. మద్యం నిషేధం కారణంగా గత ఎన్నికల్లో మహిళలు భారీ ఎత్తున నితీశ్‌కు మద్దతు తెలిపారు.