NEET UG | న్యూఢిల్లీ, పాట్నా, జూన్ 24: నీట్-యూజీ పరీక్ష జరగడానికి ఒక రోజు ముందు మే 4న సాల్వర్ ముఠా సభ్యుడికి సమాధానాలు పీడీఎఫ్ రూపంలో వచ్చిందని బీహార్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాలో బల్దేవ్ కుమార్ ప్రధానమైన వ్యక్తి అని.. సంజీవ్ కుమార్ పాత్ర కూడా పెద్దదేనని తెలిపారు. పీడీఎఫ్‌లో ఉన్న సమాధానాలను ఒక స్కూల్లోని వై-ఫై ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకొని వాటిని కొందరు విద్యార్థులకు ఇచ్చి సమాధానాలు బట్టీ పట్టించారని వెల్లడించారు. విద్యార్థులు ఒక బాలుర వసతి గృహంలో, ప్లే స్కూల్లో ఈ సమాధానాలను బట్టీ పట్టాక దాదాపుగా వాటిని కాల్చేశారని.. అయితే వాటి అవశేషాలను సేకరించడం ద్వారా సాల్వర్ ముఠా అక్రమాలు కనిపెట్టగలిగామని పోలీసులు తెలిపారు. ఈ వివరాలన్నీ సీబీఐకి అప్పగించినట్టు వారు తెలిపారు. నీట్‌ను రద్దు చేసి పాత పద్ధతిలో వైద్య విద్య ప్రవేశాల పరీక్షలను రాష్ర్టాలే నిర్వహించేలా చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె ఆయనకు ఒక లేఖ రాశారు.
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ఎన్ఎస్యూఐ సభ్యులు కొందరు సోమవారం పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. ‘ఛాత్రా సంసద్ ఘెరావ్’ పేరిట వారు చేపట్టిన మార్చ్‌ను పోలీసులు వెంటనే అడ్డుకొని ఆందోళనకారులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ నెల 23న నిర్వహించాల్సిన నీట్-పీజీ పరీక్షను 12 గంటల ముందు వాయిదా వేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది విద్యార్థులను వేధించడమేనని సునంద పన్సారీ అనే విద్యార్థిని విమర్శించింది. తాను పరీక్షకు హాజరవడం కోసం 600 కిలోమీటర్లు ప్రయాణించానని తెలిపింది. పన్సారీ వ్యాఖ్యలపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఈ దేశంలో పోటీ పరీక్షలు ఒక జోక్‌లాగా మారిపోయాయని అన్నారు. మంచి వైద్యులందరినీ దేశం విడిచి వెళ్లేలా చేసేందుకు ఈ తరహా లీకేజీ పరీక్షల విధానం అవసరమని మరొక విద్యార్థిని విమర్శించింది.