పాట్నా: వేసవికాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. అయితే ఒక మంత్రి వినూత్నంగా వ్యవహరించారు. ఎండాకాలంలో పేదలకు చలి దుప్పట్లు పంపిణీ చేశారు. (Minister Distributes Blankets) దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీహార్ క్రీడల మంత్రి సురేంద్ర మెహతా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గం పరిధిలోని అహియాపూర్ గ్రామానికి చెందిన 500 మంది పేద ప్రజలకు చలి దుప్పట్లు పంపిణీ చేశారు.
కాగా, మంత్రి సురేంద్ర మెహతా ఈ విషయాన్ని చాలా గొప్పగా తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకున్నారు. ‘అంత్యోదయ, దేశ నిర్మాణ స్ఫూర్తితో పని చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బచ్వారా అసెంబ్లీ నియోజకవర్గంలోని గోవింద్పూర్-2 పంచాయతీలోని అహియాపూర్ గ్రామంలో ఈ రోజు వేడుకలు జరుపుకున్నాం. ప్రజలను బట్టలతో సత్కరించాం’ అని ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రజలకు చలి దుప్పట్లు పంపిణీ చేసిన ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను అందులో షేర్ చేశారు.
మరోవైపు భగభగమండే ఎండాకాలంలో మంత్రి సురేంద్ర మెహతా పేద ప్రజలకు చలి దుప్పట్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చాలా మంది వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలను ఆకట్టుకునేందుకు అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు.
BJP ministers in Bihar are distributing blankets to poor people when the temperature is above 40 degree centigrade.pic.twitter.com/RzyimDt2sa
— Sourav || সৌরভ (@Sourav_3294) April 8, 2025