న్యూఢిల్లీ: జనాభా లెక్కల సమయంలో కుల గణన చేపట్టాలని బీహార్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు కోరినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత ఎస్సీ, ఎస్టీలను మినహాయిస్తే, ఇతర కులాలకు చెందిన జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదని మంత్రి వెల్లడించారు. త్వరలో చేపట్టబోయే జనాభా లెక్కల్లో.. కులాల వివరాలు కూడా సేకరించాలని బీహార్, మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వా డిమాండ్ చేసినట్లు మంత్రి తెలిపారు. లోక్సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2019, మార్చి 28వ తేదీన జీవోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ వల్ల 2021 జనాభా లెక్కల సేకరణ నిలిచిపోయింది. భౌగోళిక, సామాజిక ఆర్థిక అంశాల ఆధారంగా జనాభా లెక్కల్ని సేకరించనున్నారు. విద్య, ఎస్సీ, ఎస్టీ, మతం, భాష, వివాహం, వైకల్యం లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. తొలి దశ జనాభా లెక్కల కోసం క్వశ్చనేర్ను నోటిఫై చేసినట్లు మంత్రి తెలిపారు. డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కల సేకరణ ఉంటుందన్నారు. డేటా సేకరణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.