పాట్నా: జనాలను కరిచి ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలను గన్తో కాల్చి చంపుతున్నారు. ఇప్పటికే 35కు పైగా కుక్కలను హతమార్చారు. బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. బచ్వారా బ్లాక్ పరిధిలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మహిళలు, పిల్లలపై దాడి చేసి కరుస్తున్నాయి. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఒక మహిళ చనిపోయింది. సోమవారం పొలంలో పని చేస్తున్న ముగ్గురు మహిళలను కుక్కలు కరిచాయి. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే కుక్కలు కరువడంతో తొమ్మిది మంది మహిళలు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. డిసెంబర్ నెలలో నలుగురు చనిపోయారు.
కాగా, ఈ ప్రాంతంలోని వీధి కుక్కలు బయట పడేసే మాంస వ్యర్థాలు తిని పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మనుషులపై దాడి చేసి తినేందుకు కుక్కలు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో క్రూరంగా ప్రవర్తిస్తున్న పిచ్చి కుక్కలను చంపేందుకు షూటర్లను ప్రభుత్వం రంగంలోకి దించింది. దీంతో మంగళవారం 15, బుధవారం 9 కుక్కలను షూటర్లు చంపారు. గత వారం 12 వీధి కుక్కలను హతమార్చారు.