పాట్నా, నవంబర్ 13 : ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. జేడీయూ అధినేత, రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్‌కుమార్‌కు (Nitish Kumar) ఐదవ పర్యాయం పీఠం దక్కుతుందా లేక బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటే మహాఘట్బంధన్కు అధికారం దక్కుతుందా అన్న విషయం మరి కొన్ని గంటల్లోనే తేలిపోనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాలలో మొత్తం 46 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కేంద్ర పరిశీలకులు, అభ్యర్థులు నియమించిన ఏజెంట్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఈ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామని ఈసీ వివరించింది. బీహార్ ఎన్నికలలో ప్రధానంగా ఎన్డీఏ, ఇండియా కూటమి తలపడుతున్నాయి.
ఓట్ల లెక్కింపు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం వివిధ రాజకీయ పార్టీల నాయకులు కౌంటింగ్ ఏర్పాట్లు ఫలితాల సరళిపై విస్తృతంగా చర్చలు, సమీక్షలు నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా ఎదుర్కోవడానికి తమ పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ప్రకటించగా ఆర్జేడీకి చెందిన మరో నాయకుడు సునీల్ కుమార్ సింగ్ మరో అడుగు ముందుకేసి 2020లో జరిగినట్లు ఓట్ల లెక్కింపు మధ్యలో ఆగినా, ఆర్జేడీ అభ్యర్థులు ఓడిపోయినా నేపాల్ వంటి పరిస్థితిని వీధుల్లో చూడాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోపక్క బీజేపీ మాత్రం ఎన్డీయేకు మరో పర్యాయం అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారని, ఓటమి నిస్పృహతోనే ఆర్జేడీ నాయకులు ఇటువంటి హెచ్చరికలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓటింగ్ ఎంత ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.