Nitish on Modi | ప్రధాని నరేంద్ర మోదీని జాతిపితగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య కీర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు అమృతా ఫడ్నవీస్ వ్యాఖ్యలను ఖండించగా.. తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ఆక్షేపణ వ్యక్తం చేశారు. మోదీని జాతిపితగా వర్ణించడం ఎంతమాత్రమూ సబబు కాదని కరాఖండితంగా చెప్పారు.
ప్రధాని మోదీ-మహాత్మాగాంధీ మధ్య పోలిక గురించి ఫడ్నవీస్ భార్య చేసిన వ్యాఖ్యల పట్ల నితీష్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నరేంద్ర మోదీ మన దేశ స్వాతంత్య్రం కోసం ఏం చేశాడు? స్వాతంత్య్ర పోరాటం కనీసం ఆర్ఎస్ఎస్ నుంచి ఎలాంటి సహాకారం లేదు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా నాన్నతోపాటు నేను కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాను. బాపూజీ సహకారాన్ని మనం ఎప్పటికీ మర్చిపోగలమా? ఇప్పుడు ఆయనను విడిచిపెట్టాలనే చర్చ జరుగుతున్నది. కొత్త జాతిపితను తెరపైకి తెస్తున్నారు. ఆయన మన దేశం కోసం ఏమైనా చేశారా..? మన దేశం ఎక్కడ పురోగతి సాధించింది..?’ అని నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.