Nitish Kumar : బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్ ఇంకా బిహార్ సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన తన పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారు అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బిహార్ బీజేపీఎల్పీ సమావేశం జరగనుండటం ఆసక్తికరంగా మారింది. బీజేఎల్పీ సమావేశం ఈ నెల 14న బిహార్ రాజధాని పాట్నాలో జరగనుంది.
ఈ సమావేశంలో నూతన బీజేఎల్పీ లీడర్‌ను ఎన్నుకుంటారు. అయితే, ఆయనే బిహార్ నూతన సీఎం అవుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నితీష్ సీఎంగా రాజీనామా తర్వాత కూటమిలోని బీజేపీ నుంచి ఒకరు సీఎం అయ్యే అవకాశాలున్నాయి. అందుకే 14న జరగబోయే బీజేఎల్పీ సమావేశం బిహార్ రాజకీయాల్లో చాలా కీలకం కానుంది. నితీష్ సీఎంగా తప్పుకోనుండటంతో కొత్తగా ఎన్నికయ్యే బీజేఎల్పీ నేత కూటమి ప్రభుత్వం తరఫున సీఎం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అంశాన్ని పర్యవేక్షించేందుకు మాజీ సీఎం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీజేపీ అధిష్టానం నియమించింది. బీజేపీఎల్పీతోపాటు బిహార్ సీఎంను ఎంపిక చేసే బాధ్యత కూడా ఆయనదే. ఈ విషయంలో ఆయన పార్టీలో అందరినీ ఒప్పించాలి.
ఈ సమావేశం అనంతరం బీజేపీ నిర్ణయాన్ని బట్టి నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. అయితే, ఈ విషయంలో ఇటు నితీష్ నుంచి కానీ, అటు బీజేపీ నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాగే, రాజ్యాంగం ప్రకారం నితీష్ కుమార్ మరో ఆరు నెలలు సీఎంగా కొనసాగే అవకాశాలున్నాయి.