Christian Michel | అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణం కేసులో బ్రిటన్ పౌరుడు క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూడువేలకోట్లకుపైగా కుంభకోణంలో మైఖేల్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లుగా ఆరోపణలున్నాయి. రూ.3600 కోట్ల విలువైన 12 వీవీఐ హెలికాప్టర్ కొనుగోలులో క్రిస్టియన్ మైఖేల్ పాత్రపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నది. ఆయనను దుబాయి నుంచి రప్పించి 2018 డిసెంబర్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంపై సీబీఐ, ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నాయి.
గతంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2023లో జేమ్స్ మార్చి 11, 2022 ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారు. హైకోర్టు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కేసుల్లో మైఖేల్ సగం శిక్షను అనుభవించారని.. బెయిల్‌పై తనను విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ను తిరస్కరించింది. తాజాగా గతేడాది మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది. అదే ఏడాది డిసెంబర్లో మళ్లీ సుప్రీంకోర్టు తలుపుతట్టగా.. బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు సీబీఐ సమాధానం కోరింది.
అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో జైలులో ఉన్న క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్‌కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీకి ఏర్పాట్లు చేయాలని జనవరి 12న ఢిల్లీ కోర్టు ఎయిమ్స్‌ను ఆదేశించింది. ఆయన పెట్టుకున్న పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని.. తుంటి మార్పిడి శస్త్రచికిత్స అవసరమని కోర్టుకు తెలిపారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో 12 హెలీకాప్టర్స్ను భారత వైమానికి దళానికి అప్పగించేలా రూ.3,600కోట్లతో ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, సుమారు రూ.480 కోట్లు చేతులు మారాయని తేలింది. ఈ వ్యవహారంపై సీబీఐతో పాటు ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. ఈ కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్నాడనే ఆరోపణలపై బ్రిటన్ జాతీయుడైన క్రిస్టియన్ మైఖేల్‌ను దుబాయి 2018లో భారత్‌కు అప్పగించింది. అప్పటి నుంచి మైఖేల్ భారత కస్టడీలో ఉన్నారు.