జైపూర్: కాంగ్రెస్ అధిష్ఠానానికి ఊరట కలిగే పరిణామం మంగళవారం రాజస్థాన్ కాంగ్రెస్లో చోటుచేసుకుంది. అక్కడి కాంగ్రెస్లో అంతర్గతపోరు రాహుల్ భారత్ జోడో యాత్రను ఇరకాటంలోకి నెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఐక్యతా సంకేతాలిచ్చారు. పార్టీ జనరల్ సెక్రెటరీ, ఆర్గనైజర్ కేసీ వేణుగోపాల్ మంగళవారం జైపూర్ చేరుకుని నేతలిద్దరితో మంతనాలు జరిపారు. అనంతరం కలిసికట్టుగా మీడియా ముందుకు వచ్చి, తామంతా కలిసికట్టుగా ఉన్నామని ప్రకటించారు.
”మేమంతా ఐక్యంగానే ఉన్నాం. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అరమరికలు లేవని, కలిసికట్టుగా ఉన్నామని ఇక్కడున్న గెహ్లాట్, పైలట్ సైతం చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాజస్థాన్ నాయకులు ఇద్దరు (గెహ్లాట్, పైలట్) మాకు ఆస్తులని రాహుల్ కూడా చెప్పారు” అని కేసీ వేణుగోపాల్ మీడియాతో అన్నారు.
గెహ్లాట్, పైలట్ ఇద్దరూ పార్టీ ఆస్తులని రాహుల్ చాలా స్పష్టంగా చెప్పారని, తామంతా కలిసికట్టుగా ఉన్నామని గెహ్లాట్ కూడా తెలిపారు. రాజస్థాన్లో రాహుల్ గాంధీకి రెట్టించిన ఉత్సాహంతో ఘన స్వాగతం పలుకుతామని సచిన్ పైలట్ చెప్పారు. రాహుల్ 12 రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తారని, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం ద్వారా రాహుల్ భారత్ జోడో యాత్ర చారిత్రక యాత్రగా నిలిచిపోనుందని అన్నారు.