Sadhguru Jaggi Vasudev : బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు బంగ్లాదేశ్ అంతర్గత విషయం కాదని పేర్కొన్నారు.
మన పొరుగునున్న మైనార్టీల భద్రత కోసం సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. వారికి అండగా నిలువకుంటే భారత్ ఏనాటికి మహాభారత్ అవదని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఈ దేశంలో భాగమైన ప్రాంతం.. పొరుగు ప్రాంతంగా మారిందని గుర్తుచేశారు. ఈ దురాగతాల నుంచి మన జాతికి చెందిన వారిని రక్షించడం మన బాధ్యత అని జగ్గీ వాసుదేవ్ స్పష్టంచేశారు.
బంగ్లాదేశ్‌లోని హిందువుల నివాసాలు, వారి వ్యాపార సంస్థలపై దాడులు, లూటీలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు సంబంధించి సంస్కరణలు అమలు చేయాలని దేశవ్యాప్త ఆందోళనకు విద్యార్థులు పిలుపునిచ్చారు. దేశ ప్రజలు వారికి మద్దతు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు, నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ క్రమంలో వందల మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
దాంతో ప్రభుత్వం దిగి వచ్చి విద్యార్థులను చర్చలకు ఆహ్వానించింది. అవి కూడా విఫలమయ్యాయి. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. దాంతో దేశంలో శాంతి భద్రతలు మరింత క్షీణించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అయినా బంగ్లాలో హిందువుల దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సద్గురు జగ్గీవాసుదేవ్ స్పందించారు.