ఏప్రిల్ 18న తన భార్య, కుమారుడితో కలసి కశ్మీరుకు బయల్దేరి వెళ్లిన భరత్ ఈనెల 23న బెంగళూరుకు తిరిగి రావలసి ఉన్నదని ఆయన అత్తగారు విమల తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తన కుమార్తె ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని తెలియచేసిందని ఆమె చెప్పారు. తన కుమార్తె తెలిపిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు ఆధార్ కార్డులు చూపించమని అడిగారని ఆమె చెప్పారు. ‘మీరు ముస్లింలా లేక హిందువులా అని అడిగారు.హిందువులం అని చెప్పగానే నా భర్తను కాల్చివేశారు’ అని తన కుమార్తె చెప్పినట్లు ఆమె తెలిపారు.
తన అల్లుడి చేతిలో మూడేళ్ల పిల్లాడు ఉన్నాడని, పిల్లాడిని కిందకు దింపమని చెప్పి కాల్పులు జరిపారని విమల వివరించారు. ముస్లిం అయితే మిమల్ని విడిచిపెడతాం అని ఉగ్రవాదులు వారితో అన్నారని, హిందువని నిర్ధారించుకున్న తర్వాత తలపై కాల్పులు జరిపారని ఆమె తెలిపారు. మూడు నిమిషాల పాటు తన అల్లుడిపై కాల్పులు జరిపారని, ఊపిరి పోయేంతవరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారని, చివరిగా తలపై కాల్చారని విమల చెప్పారు. భరత్ తండ్రి చనవీరప్ప ఓ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి. హృద్రోగి అయిన ఆయన భార్యకు విషయం చెప్పడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది.