జైపూర్, డిసెంబర్ 12: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకొన్న బీజేపీ.. రాజస్థాన్‌లోనూ అదే పంథా కొనసాగించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్ శర్మను అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం జైపూర్‌లో సమావేశమైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు భజన్‌లాల్‌ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకొన్నారు.
ఈ సమావేశానికి బీజేపీ హైకమాండ్ పరిశీలకులుగా ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని బృందం హాజరైంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మాదిరిగానే రాజస్థాన్‌లోనూ అసలు సీఎం రేసులోనే పేరు వినిపించని వ్యక్తిని బీజేపీ సీఎంగా ఎంపిక చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి సీటు కోసం గట్టిగా ప్రయత్నించిన మాజీ సీఎం వసుంధరా రాజేనే ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం అభ్యర్థిగా భజన్‌లాల్ పేరును ప్రకటించడం గమనార్హం.
ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరి నేతలను బీజేపీ ప్రకటించింది. సీఎం రేసులో ప్రముఖంగా పేరు వినిపించిన దియా కుమారితో పాటు ప్రేమ్ చంద్ బైర్వాలకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించింది. అసెంబ్లీ స్పీకర్‌గా వాసుదేవ్ దేవనానిని ఎంపికచేసింది. రాజస్థాన్‌లో గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్థానాలకు గానూ బీజేపీ 115 సీట్లలో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీ 69 సీట్లకు పరిమితమైంది.
చివరి వరుస నుంచి ప్రభుత్వాధినేతగా..
56 ఏండ్ల భజన్‌లాల్ శర్మ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నాలుగుసార్లు ఈ పదవి చేపట్టారు. ఆయనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) మద్దతు ఉన్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన సంగనేర్ నియోజకవర్గం నుంచి 48 వేల ఓట్లకు పైగా మెజార్టీతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ఏబీవీపీతోనూ గతంలో సంబంధాలు ఉన్నాయి. భజన్‌లాల్ పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు. కాగా, శాసనసభా పక్ష సమావేశానికి ముందు ఎమ్మెల్యేలు తీసుకొన్న గ్రూపు ఫొటోలో చివరి వరుసలో నిలబడిన భజన్‌లాల్ శర్మనే ఇప్పుడు ప్రభుత్వ పగ్గాలు చేపడుతుండటం గమనార్హం.
అనూహ్యంగా తెరపైకి భజన్‌లాల్
అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత గత వారం రోజులుగా కొత్త సీఎంగా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఈ జాబితాలో మాజీ సీఎం వసుంధరా రాజే వంటి వాళ్లు ఉన్నారు. ఫలితాల వచ్చిన నాటి నుంచే సీఎం పదవి పొందేందుకు రాజే గట్టిగా ప్రయత్నాలు చేశారు. వరుసగా పలుమార్లు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం అవుతూ అధిష్ఠానానికి తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు.
వసుంధరా రాజేతోపాటు రాజస్థాన్ యోగిగా పేరుపొందిన బాబా బాలక్‌నాథ్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్ పేర్లు కూడా సీఎం రేసులో ప్రముఖంగా వినిపించాయి. అయితే వీరందరినీ కాదని రాష్ర్టానికి కొత్త సీఎంగా బీజేపీ అధిష్ఠానం తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్ శర్మ వైపు మొగ్గు చూపడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.