Punjab CM : మోదీ సర్కార్ అరవింద్ కేజ్రీవాల్‌పై తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపిందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు కానీ ఆయన ఆలోచనలను మీరు ఎలా నిర్బంధిస్తారని ప్రశ్నించారు. హోషియార్‌పూర్‌లో భగవంత్ మాన్ మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కేజ్రీవాల్ సిద్ధాంతాన్ని విశ్వసించే కోట్లాది ప్రజలను మీరు ఏం చేస్తారని నిలదీశారు. ప్రజలను నిరంకుశంగా అణిచివేస్తే వారు కొన్నేండ్ల పాటు మౌనం దాల్చవచ్చని కానీ 20 ఏండ్ల అనంతరం వారు మేల్కొంటే ఏం జరుగుతుందో ఇవాళ బంగ్లాదేశ్‌లో చూస్తున్నామని చెప్పారు. ప్రజల ఆగ్రహం కట్టలుతెంచుకోవడంతో బంగ్లాదేశ్ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి అరగంటలోనే పారిపోయారని చెప్పారు.
ప్రధాని నివాసం నుంచి ప్రజలు వస్తువులను తీసుకువెళ్లారని చెప్పారు. దీర్ఘకాలం ప్రజలను వేధిస్తే ఇదే జరుగుతుందని హెచ్చరించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలని, కానీ మీరు మీ సొంత కుటుంబాలకు మేలు చేయడంలో తలమునకలయ్యారని, ఇందుకు బంగ్లాదేశ్ ఉదంతమే గొప్ప పాఠమని భగవంత్ మాన్ అన్నారు.
Read More :