పంజాబ్లో జయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. త్వరలోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ముందుగా ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్.. బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం భగత్ సింగ్ పుట్టిన గ్రామం ఖట్కర్ కాలన్ను ఆయన ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే తన ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా చేశారు.
2014 నుంచి పంజాబ్లో సంగ్రూర్ నుంచి ఎంపీగా సేవలందిస్తున్న భగవంత్ మాన్.. స్పీకర్ ఓంబిర్లాను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించారు. ‘‘సంగ్రూర్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా నాపై అసమాన ప్రేమను కురిపించినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు పంజాబ్ మొత్తానికి సేవ చేసే అవకాశం దక్కింది. త్వరలోనే సంగ్రూర్ ప్రజల గొంతు లోక్సభలో గట్టిగా వినిపిస్తుందని మాటిస్తున్నా’’ అని భగవంత్ మాన్ అన్నారు.
అలాగే తను పార్లమెంటు భవనాన్ని మిస్ అవుతానని చెప్పారు. తనకు పంజాబ్ చాలా పెద్ద బాధ్యత ఇచ్చిందన్నారు. కాగా, ఇటీవల వెలువడిన పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో మాజీ సీఎం అమరీందర్ సింగ్, ఆ తర్వాత ప్రభుత్వ పగ్గాలు అందుకున్న చరణ్జీత్ చన్నీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ అందరూ ఓటమిపాలయ్యారు.
మొత్తం 117 సీట్లలో ఆప్ అభ్యర్థులు 92 చోట్ల ఘనవిజయం సాధించారు. ధురి నియోజకవర్గం నుంచి బరిలో దిగిన భగవంత్ మాన్ కూడా 58 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.