కోల్‌కతా: తృణమూల్ పార్టీకి కంచుకోటగా భావించిన భవానీపూర్‌లో ఓటర్లు సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో తనను ఓడించిన తన మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి.. ఈసారి భవానీపూర్‌లోనూ ఆమెను గట్టి దెబ్బకొట్టారు. ఇంతవరకు ఓటమి ఎరుగని ‘భవానీపూర్’ స్థానంలో మమతా బెనర్జీ ఓటమి చవిచూశారు. నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల కౌంటింగ్‌లో సువేందు అధికారి 15,105 ఓట్ల తేడాతో మమతపై గెలుపొందారు. 2011లో రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భవానీపూర్ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2021లో నందిగ్రామ్‌లో ఓటమి తర్వాత, తిరిగి భవానీపూర్ నుంచి పోటీ చేసి.. 54వేల మెజార్టీతో మమత గెలుపొందారు. ఈసారి భవానీపూర్‌లో సువేందు అధికారి రూపంలో గట్టి సవాల్ ఎదురైంది. ఓట్ల లెక్కింపులో ఇద్దరి మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. మొదటి 8 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 15 వేల మెజార్టీతో ముందంజలో ఉన్న మమత, అటు తర్వాత క్రమంగా ఆమె మెజారిటీ తగ్గుముఖం పట్టింది. 16వ రౌండ్లో గేమ్ ఒక్కసారిగా సువేందు వైపు తిరిగింది. సువేందు మెజారిటీ 6 వేలకు పెరిగింది. 18వ రౌండ్లో 10 వేలకు, 20వ రౌండ్లో సువేందుకు మెజారిటీ 15 వేల మార్క్‌ను దాటడంతో మమత ఓటమి ఖరారైంది.