బెంగళూరు, అక్టోబర్ 8: కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) అధ్వానంగా మారి పెద్దపెద్ద గుంతలు పడ్ల రోడ్లకు ఇప్పట్లో మోక్షం లభించే సూచనలు కన్పించడం లేదు. అధికార కాంగ్రెస్ పేర్కొన్నట్టు 31లోగా గానీ, ఆ ముందుగా గానీ గోతులను పూడ్చి మరమ్మతులు చేసే పరిస్థితి ఎంతమాత్రం లేదు. ఎం దుకంటే చాలా పనులు డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ పరిధి ఆవల ఉన్నందున చేసిన పనికి బిల్లులు ఎవరు చెల్లిస్తారనే దానిపై బీబీఎంపీ కాంట్రాక్టర్ల సంఘం మరింత స్పష్టత కోరుతున్నది.
2013 నుంచి చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.2,400 కోట్ల బాకీ ఉండగా, పలు హెచ్చరికలు, నిరసనల తర్వాత వారికి ప్రభుత్వం 500 కోట్లను విడుదల చేసిందని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మంజునాథ్ తెలిపారు. ఆ సొమ్మును ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించ లేదన్నారు. ప్రభుత్వం ఇప్పుడు గుంతలను పూడ్చమని అడుగుతోందని, ఇవి చాలామంది కాంట్రాక్టర్ల డీఏపీ కింద లేవన్నారు. డీఎల్పీ అంటే కాంట్రాక్టర్లు రోడ్లను నిర్వహించాల్సిన నిర్దిష్ట సమయం అని తెలిపారు. బెంగళూరు రోడ్లపై ఈ భారీ గోతులకు అవినీతే ప్రధాన కారణమని, పారదర్శకత పూర్తిగా లోపించిందని ఆయన ఆరోపించారు.