బెంగుళూరు: బెంగుళూరుకు చెందిన 46 ఏళ్ల మహిళ.. డిజిటల్ అరెస్టు(Digital Arrest)కు గురైంది. 11 రోజుల పాటు సైబర్‌నేరగాళ్లు ఆమెను వేధించి.. 30 లక్షలు కాజేశారు. బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి.. ఆ సొమ్మును సైబర్ మోసగాళ్లకు ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. సీబీఐ, ముంబై పోలీసు శాఖ నుంచి ఫోన్ చేస్తున్నట్లు ఆ మహిళను సైబర్‌నేరగాళ్లు బెదిరించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆ మహిళకు డిసెంబర్ 3వ తేదీన 10.45 నిమిషాలకు ఐవీఆర్ ఫోన్ కాల్ వచ్చింది. ట్రాయ్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, 9 బటన్ నొక్కాలన్నారు. లేదంటే నెంబర్‌ను డిస్కనెక్ట్ చేసి, బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేస్తామని బెదిరించారు.
ముంబైలో తీసుకున్న సిమ్ కార్డు నెంబర్‌తో వేధింపులు మెసేజ్‌లు చేశారని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యిందని, పంత్ నగర్ పోలీసు స్టేషన్‌కు కాల్‌ను ఫార్వర్డ్ చేస్తున్నట్లు ఫోన్లో ఆమెను బెదిరించారు. మరో వ్యక్తి తాను పంత్ నగర్ పోలీసు స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ను అని చెప్పి ఫోన్లో విచారించారు. అయిదు గంటల్లో ముంబైకి రావాలని లేదంటే డిజిటల్ అరెస్టు చేస్తామన్నారు. ప్రయాణం చేయలేని పరిస్థితిలో ఉన్న ఆమె డిజిటల్ అరెస్టు అయ్యింది.
ఆ తర్వాత ఆమెకు సీబీఐ ఏసీపీ ప్రదీప్ కుమార్ పేరుతో కాల్ వచ్చింది. మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. అయిదు గంటల పాటు ఆమెను విచారించారు. బ్యాంకులో దాచుకున్న డబ్బును ట్రాన్స్ఫర్ చేయాలని, సుప్రీంకోర్టు ఆడిటర్ వెరిఫై చేస్తాడని ఆ ఫోన్ కాల్లో తెలిపారు. భయంతో ఆ మహిళ తొలుత 99 వేలు పంపింది. ఆ తర్వాత డిసెంబర్ 4, 5, 7 తేదీల్లో 10 లక్షలు, 9 లక్షలు, 8.5 లక్షల ఎఫ్డీలను బ్రేక్ చేసి.. ఆ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లకు ట్రాన్స్ఫర్ చేసింది.
మనీల్యాండరింగ్‌తో లింకున్న నెంబర్లకు ఆమె పంపిన నెంబర్లకు సంబంధం ఉన్నట్లు నేరగాళ్లు బెదిరించారు. 20 లక్షల పెనాల్టీ కట్టాలని, లేదంటే అరెస్టు చేయాల్సి వస్తుందన్నారు. ఇంటిని అమ్మేసి అమౌంట్ కట్టాలని బెదిరించారు. డిసెంబర్ 13, 14 తేదీల్లో 90 వేలు ట్రాన్స్ఫర్ చేసిందామె. ఆ తర్వాత డిసెంబర్ 15వ తేదీన స్కైప్ ఐడీ డీయాక్టివేట్ అయ్యింది. ఆన్లైన్ స్కామ్‌ల గురించి తెలుసుకున్న ఆ మహిళ.. డిసెంబర్ 19వ తేదీన పోలీసుల్ని ఆశ్రయించింది. బెంగుళూరు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.