Bengaluru : సోషల్ మీడియాలో పరిచయాలు, వాటినుంచి ఏర్పడ్డ బంధాలు చాలావరకు విషాదంతో ముగుస్తున్నాయి. తాజాగా ఇలాంటి పరిచయం ఒక హత్యకు దారితీసింది. తనతో సహజీవనం చేస్తున్న యువతిని గొంతు నులిమి చంపాడు ఆమె ప్రియుడు. ఈ ఘటన గత శనివారం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. మృతురాలిని అనూష (20) గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్సన్ జిల్లా, సక్లేష్పూర్కు చెందిన అనూష అనే యువతికి, అదే ప్రాంతానికి చెందిన శరత్ (27) అనే వ్యక్తితో కొంతకాలం క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది.
తర్వాత ఈ పరిచయం ఇద్దరి మధ్యా ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరూ బెంగళూరు వచ్చి మల్లేశ్వరం ప్రాంతంలో అద్దెకుంటూ సహజీవనం చేస్తున్నారు. శరత్ బెంగళూరులో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. అక్కడ దాదాపు ఆరు నెలలుగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా కొద్దిరోజులుగా విబేధాలు చోటు చేసుకున్నాయి. తాజాగా గత శనివారం కూడా ఇద్దరిమధ్యా వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ఆవేశానికి గురైన శరత్.. అనూషపై దాడి చేసి, ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
తర్వాత సోమవారం తన లాయర్‌కు ఫోన్ చేసి అనూష హత్య గురించి చెప్పాడు. వెంటనే ఆ లాయర్ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. శేషాద్రిపురం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.