Bengaluru : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో సినీ ఫక్కీలో నాటకీయ ఘటన చోటుచేసుకుంది. బైకును ఢీకొట్టి పారిపోబోయిన ఆటోను ట్రాఫిక్ పోలీస్ ఆపడంతో.. ఆ ఆటో డ్రైవర్ ఏకంగా ట్రాఫిక్ పోలీస్‌నే కిడ్నాప్ చేశాడు. నవంబర్ 27న రాత్రి సదాశివనగర్ (Sadashivanagar) 10వ క్రాస్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. సదాశివనగర్ 10వ క్రాస్ దగ్గర ఓ ఆటో రాంగ్రూట్లో వచ్చి బైకును ఢీకొట్టింది. అయినా ఆటో డ్రైవర్ ఆపకుండా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ గమనించి ఆటోకు అడ్డంతిరిగాడు. ఆటోలో ఎక్కి కూర్చుని పక్కకు తీయమని డ్రైవర్‌ను ఆదేశించాడు. కానీ ఆటోడ్రైవర్ ట్రాఫిక్ పోలీస్‌తోపాటు ఆటోను ముందుకు పోనిచ్చాడు.
ట్రాఫిక్ పోలీస్ ఆగుఆగు అంటూ హెచ్చరించినా కొద్ది ఆటో వేగం పెంచాడు. దాంతో ట్రాఫిక్ పోలీస్, ఆటోడ్రైవర్ మధ్య రన్నింగ్‌లోనే పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీస్ ఆటోలో నుంచి కింద పడిపోయాడు. ఆటోను అనుసరిస్తూ వచ్చిన మరో ఇద్దరు పోలీసులు ఆయనను పైకిలేపారు. ఆ తర్వాత కొంతదూరం వెంబడించగా ఆటో డ్రైవర్ ఆటోను వదిలేసి కాలినడకన పారిపోయాడు.
నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడిపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, స్కూటీని ఢీకొట్టడం, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ పోలీస్‌ను కిడ్నాప్ చేయడం తదితర కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.