బెంగళూరు, జనవరి 19: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి సైబర్ కేటుగాళ్లు బెంగళూరులో ఓ టెకీ నుంచి రూ.11 కోట్లు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులు తరుణ్ నటానీ, కరన్, ధావల్ షాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితుడు విజయ్‌కుమార్ వద్ద స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రూ.12 కోట్ల వరకు ఉన్నాయని నిందితులు తెలుసుకున్నారు. ఆ మొత్తాన్ని కాజేయడానికి కుట్ర పన్నారు. పోలీసులు, ఈడీ, కస్టమ్స్ అధికారులుగా నటిస్తూ, మనీలాండరింగ్ కేసుపై అరెస్టు చేస్తామని బెదిరించారు.
విజయ్‌కుమార్ వ్యక్తిగత వివరాలు, పాన్, ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించాక, అతడి బ్యాంక్ ఖాతాల నుంచి కొన్ని నెలలపాటు రూ.11 కోట్లను తమ బ్యాంక్ ఖాతాల్లోకి తరలించుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో, పోలీసులు రూ.7.5 కోట్ల తరలింపును పట్టుకోగలిగారు.