బెంగళూరు: టెక్ ప్రొఫెషనల్ అయిన వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. (Techie Kills Wife) మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో ఉంచాడు. ఇంటి నుంచి పారిపోయి సొంత రాష్ట్రానికి చేరుకున్నాడు. అక్కడ ఆత్మహత్యకు యత్నించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 36 ఏళ్ల రాకేష్ రాజేంద్ర ఖేడేకర్, 32 ఏళ్ల గౌరీ అనిల్ సంబేకర్ భార్యాభర్తలు. మహారాష్ట్రకు చెందిన ఈ జంట ఏడాదిగా బెంగళూరు దొడ్డకన్నహళ్లి ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. రాకేష్ ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు.
కాగా, గురువారం రాకేష్ తన భార్య గౌరీని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పది భాగాలుగా నరికాడు. వాటిని ఒక సూట్‌కేస్‌లో ఉంచాడు. గౌరీని చంపిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత బెంగళూరు నుంచి పారిపోయాడు. మహారాష్ట్రలోని పూణేకు చేరుకున్నాడు. విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు.
మరోవైపు గౌరీ తల్లిదండ్రులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు కర్ణాటక పోలీసులను సంప్రదించారు. రాకేష్ నివసించిన ఇంటి ఓనర్‌ను పోలీసులు అలెర్ట్ చేశారు. సూట్‌కేసులో గౌరీ మృతదేహం ఉన్నట్లు చూసిన ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. గౌరీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
కాగా, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు కలిసి రాకేష్ ఆచూకీ కోసం సాంకేతికంగా వెతికారు. అతడు పూణేలో ఉన్నట్లు గుర్తించారు. విషం సేవించి అపస్మారక స్థితిలో ఉన్న రాకేష్‌ను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కోలుకున్న తర్వాత బెంగళూరు తరలించేందుకు కర్ణాటక పోలీసులు పూణే చెరుకున్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.