Bengaluru teacher : కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన దుస్తులపై నీళ్లు పోశాడన్న కోపంతో ఓ టీచర్ బాలుడి పళ్లు విరగ్గొట్టింది. జయనగర్ ఏరియాలోని 5వ బ్లాక్‌లో గల హోలీ క్రిస్ట్ ఇంగ్లిష్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. హోలీ క్రిస్ట్ స్కూల్లో అజ్మత్ అనే యువతి హిందీ టీచర్‌గా పనిచేస్తోంది. ఇటీవల లంచ్ టైమ్‌లో పిల్లలు అల్లరి చేస్తూ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటుండగా అజ్మత్ ఆ క్లాసులోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెపై నీల్లు పడ్డాయి. ఆగ్రహించిన అజ్మత్ తనపై నీళ్లు పోసిన బాలుడిని కర్రతో కొట్టింది. దాంతో దెబ్బ మూతి మీద తాకడంతో బాలుడి పళ్లు విరిగిపోయాయి.
ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు టీచర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమెను అరెస్ట్ చేయలేదు. టీచర్ కర్రతో కొడితేనే తన కుమారుడి పళ్లు విరిగాయని బాలుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొనగా.. తాను బెదిరించేందుకు కర్ర లేపడంతో బాలుడు తప్పించుకోబోయి బెంచిపైకి పడ్డాడని, బెంచి మూతికి తాకడంతో పళ్లు విరిగాయని టీచర్ చెబుతోంది.