బెంగళూరు : దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో పార్టీ నేతలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక బదిలీ వ్యవస్థపై బీజేపీ పని చేస్తోందని ఆరోపించారు. పేదల నుంచి డబ్బులు తోచుకొని బడా వ్యాపారవేత్తలకు ఇస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటకను మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామన్నారు. కర్నాటకలో ఎవరెవరు పనిచేస్తున్నారో తేలిగ్గా కనిపెట్టవచ్చన్నారు. పనితీరు ఆధారంగా టికెట్లను నిర్ణయించుకోవాలని, పార్టీ కోసం ఎవరు పని చేస్తున్నారో చూడాలన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కర్నాటక శాఖ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, రాష్ట్ర సీనియర్ నేతలతో సమావేశమయ్యారు.
2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, కర్ణాటకలో భారీ ఉత్కంఠ నెలకొంది. ఇంతకు ముందు 2018, మే 12న ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధిక స్థానాలు సాధించి, బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించలేకపోయింది. ఎన్నికల్లో కాంగ్రెస్ 80, 37 సీట్లు సాధించిన జేడీఎస్ కూటమిని ప్రకటించాయి. అయితే గవర్నర్ వాజుభాయ్ వాలా మే 17న బీఎస్ యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత విశ్వాస పరీక్షలో బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో జేడీఎస్ నేత కుమారస్వామి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగా, తిరుగుబాటుదారుల కారణంగా ఆయన ప్రభుత్వం కూలిపోయింది. 2019 జూలై 26న యడ్యూరప్ప మళ్లీ సీఎం అయ్యారు. అయితే, జూలై 2021లో యడ్యూరప్పను బీజేపీ తొలగించి బసవరాజ్ బొమ్మైని సీఎం చేసింది.