బెంగుళూరు: విడాకులు నోటీసు ఇచ్చిన భార్యను భర్త హతమార్చాడు. ఈ ఘటన ఇవాళ బెంగుళూరు(Bengaluru)లో జరిగింది. నిందితుడిని బాలమురగన్.. బాధితురాలిని భువనేశ్వరిగా గుర్తించారు. నోటీసులు ఇచ్చిన వారం రోజుల్లో భార్య ప్రాణాలు తీశాడు భర్త. నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. భార్యను చంపిన తర్వాత పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు భర్త. వివరాల్లోకి వెళ్తే.
40 ఏళ్ల బాలమురగన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నారు. 39 ఏళ్ల భువనేశ్వరి యూనియన్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తున్నది. ఆ జంట 2011లో పెళ్లి చేసుకున్నది. భర్తకు ఉద్యోగం రావడంతో 2018లో ఆ జంట బెంగుళూరుకు మకాం మార్చారు. తమిళనాడులోని సేలం జిల్లా వాళ్ల స్వగ్రామం. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వైవాహిక బంధంలో సమస్యలు రావడంతో ఏడాది నుంచి ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు. రాజాజీనగర్‌లో పిల్లలో భువనేశ్వరి ఉంటోంది. అయితే ఆమెకు మరొకరితో రిలేషన్లో ఉన్నట్లు భర్త అనుమానించాడు. దీని వల్ల తరుచూ ఇద్దరి మధ్య గొడవలయ్యేవి.
వారం క్రితం భువనేశ్వరి తన భర్తకు విడాకులు నోటీసు జారీ చేసింది. కోర్టులో ఆ కేసు పెండింగ్‌లో ఉన్నది. మంగళవారం తన భర్య కదలికలపై కన్నేసిన భర్త.. ఆమె ఆఫీసు నుంచి ఇంటికి రాగానే అటాక్ చేశాడు. సాయంత్రం 6.30 సమయంలో ఆమెపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. షాన్‌బాగ్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. కానీ గాయాలు తీవ్రం కావడంతో ఆమె మార్గంలోనే చనిపోయింది.
ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నది. ఎక్కడ నుంచి తుపాకీ వచ్చిందన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.