హొసపేటె, మే 20: భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలం అవుతున్నది. 48 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు. అయితే ప్రజల బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఏమాత్రం పట్టని అధికార కాంగ్రెస్ మాత్రం హొసపేటెలో తన రెండో వార్షిక వేడుకల్లో నిమగ్నమై ఉంది. అధికారంలోని వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సమర్పణ సంకల్ప సమావేశం పేరిట మంగళవారం బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది. దీనిని పౌరులతో పాటు విపక్ష బీజేపీ తీవ్రంగా ఆక్షేపించింది. భారీ వర్షాలు బెంగళూరును ముంచెత్తుతుంటే హోస్పేటలో వార్షిక వేడుకలు ప్రారంభించడాన్ని తప్పుపట్టింది.
బెంగళూరులో వారాంతం, సోమవారం రాత్రి కురిసిన వర్షానికి సాయి లేఅవుట్, మాన్యతా టెక్ పార్క్, సిల్క్ బోర్డ్ జంక్షన్ సహా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో లేకపోవడం బాధ్యతా రాహిత్యం, వేడుకలు జరుపుకోవడం దారుణమని బీజేపీ విమర్శించింది.
ఘోరమైన ట్రాఫిక్ జామ్‌లే కాదు.. అస్తవ్యస్త, అధ్వాన రోడ్లు బెంగళూరు నగర పౌరులకు నిత్యం నరకాన్ని చూపిస్తున్నాయి. దీంతో విసిగిపోయిన 43 ఏండ్ల బెంగళూరు వాసి బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ)కి లీగల్ నోటీస్ పంపారు. తమ వేదనకు పరిహారంగా రూ.50 లక్షలు చెల్లించాలని రిచ్మండ్ టౌన్‌కు చెందిన దివ్య కిరణ్ బీబీఎంపీకి ఈ నోటీసును పంపారు.