బెంగళూరు, డిసెంబర్ 10: భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఉత్తరప్రదేశ్‌కు చెందిన 34 ఏండ్ల టెకీ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి 24 పేజీల సుదీర్ఘమైన సూసైడ్ నోట్‌ను, 1.5 గంటల వీడియోను అతడు రికార్డ్ చేశాడు. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని అతడు వెళ్లగక్కిన ఆవేదన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు అతుల్ సుభాశ్ సోమవారం తన నివాసంలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు అతడు తన సూసైడ్ నోట్, వీడియోను పలువురికి ఈ-మెయిల్ చేశాడు. తాను సభ్యుడిగా ఉండే ఎన్జీవో వాట్సప్ గ్రూప్‌లోనూ షేర్ చేశాడు. ‘న్యాయం బకాయి ఉంది’ అన్న ప్లకార్డును తన ఇంట్లో వేలాడదీశాడు.
సూసైడ్ నోట్లో తన భార్యతో కొనసాగుతున్న వైవాహిక బంధ వివాదం గురించి పేర్కొన్నాడు. భరణం కోసం తమ నాలుగేండ్ల కొడుకును తన భార్య తనపైకి అస్త్రంగా ప్రయోగించిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ కుటుంబ న్యాయస్థానంలో తనపై తన భార్య కుటుంబం పెట్టిన కేసుల్లో హత్య, అసహజ శృంగారం, భరణం కోసం నెలకు రూ.2 లక్షల డిమాండ్ ప్రధానమైనవని వెల్లడించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, టెకీ ఆత్మహత్య నేపథ్యంలో ‘మెన్‌టూ’ అన్నది ఎక్స్‌లో ట్రెండింగ్‌గా మారింది. చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగానే ఉన్నాయని నెటిజన్లు పోస్టులు పెట్టారు.