బెంగళూరు: బ్యాంకు నుంచి డబ్బు తరలిస్తున్న క్యాష్ వ్యాన్ దోపిడీ మిస్టరీ వీడింది. దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దోచుకున్న రూ.7.11 కోట్లలో రూ.5.76 కోట్లు రికవరీ చేశారు. (Bengaluru Cash-Van Heist) కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. నవంబర్ 18న మధ్యాహ్నం 12.48 గంటల సమయంలో ఒక బ్యాంకు బ్రాంచ్ నుంచి రూ.7.11 కోట్లు తరలిస్తున్న సీఎంఎస్ క్యాష్ వ్యాన్ను జయనగర్ డైరీ సర్కిల్ సమీపంలోని అశోక పిల్లర్ వద్ద కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. ‘ప్రభుత్వ వాహనం’ స్టిక్కర్ ఉన్న వాహనంలో వచ్చిన ఆ వ్యక్తులు ఆర్బీఐ అధికారులుగా నమ్మించారు. వ్యాన్ సిబ్బందిని గన్తో బెదిరించారు. డబ్బుకు సంబంధించిన పత్రాలను ధృవీకరించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. సిబ్బందితోపాటు క్యాష్ బాక్సులను తమ వాహనంలోకి ఎక్కించారు. మార్గమధ్యలో వ్యాన్ సిబ్బందిని దించేసి రూ.7.11 కోట్ల డబ్బుతో పారిపోయారు.
కాగా, బెంగళూరులో సంచలనం రేపిన ఈ సంఘటనపై దర్యాప్తు కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవాలో 30 మందికి పైగా అనుమానితులను విచారించారు. చివరకు సీఎంఎస్ సంస్థకు చెందిన వారే ఈ దోపిడీకి పాల్పడినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు.
ఆ కంపెనీ వాహనాల కదలికలకు బాధ్యత వహించే ఇన్ఛార్జ్, ఆ సంస్థ ఆపరేషన్స్ గురించి బాగా తెలిసిన మాజీ ఉద్యోగి, గ్రౌండ్ సపోర్ట్, ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిన గోవిందపుర పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేశారు. సీఎంఎస్ సంస్థ లాజిస్టిక్స్ హ్యాండ్లర్లు, స్పాటర్లు, డబ్బు తరలింపుదారులతో సహా 6 నుంచి 8 మంది వ్యక్తులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు క్యాష్ వ్యాన్ దోపిడీ కోసం ఈ ముఠా మూడు నెలలుగా ప్లాన్ చేసి రెక్కీ నిర్వహించిందని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. రూ.5.76 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్టైన ముగ్గురు నిందితులు బెంగళూరుకు చెందినవారని అన్నారు. ఇది తీవ్రమైన కేసు అని తెలిపారు. ఇలాంటిది మళ్ళీ జరుగకుండా ఉండేందుకు సీఎంఎస్ కంపెనీ అధిపతులను పిలిచినట్లు చెప్పారు. ఆర్బీఐ మార్గదర్శకాల ఉల్లంఘన, భద్రతా లోపాల గురించి వారితో చర్చించినట్లు వివరించారు. 60 గంటల్లో కేసు ఛేదించిన బెంగళూరు పోలీస్ బృందానికి రూ. 5 లక్షల నగదు బహుమతిని పోలీస్ కమిషనర్ అందజేశారు.
Also Read:
Arms Racket Busted | చైనా, టర్కీలో తయారై పాక్ నుంచి సరఫరా.. అంతర్జాతీయ ఆయుధ రాకెట్ గుట్టురట్టు
Watch: పెళ్లిలో వ్యక్తి చెంపపై కొట్టిన డ్యాన్సర్.. తర్వాత ఏం జరిగిందంటే?
2 brides in a month | ఒకే నెలలో ఇద్దరు మహిళలను పెళ్లాడిన వ్యక్తి.. అరెస్ట్ చేయించిన భార్యలు