బెంగళూరు/హైదరాబాద్: ఒక విద్యార్థి కోచింగ్ సెంటర్ నుంచి పారిపోయాడు. (Bengaluru boy) ఆ బాలుడు తన వద్ద ఉన్న పార్కర్ పెన్నులు అమ్మి వంద సంపాదించాడు. ఆ డబ్బుతో మూడు నగరాలు చుట్టాడు. అయితే కుమారుడు కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో చేసిన విన్నపానికి ఒకరు స్పందించారు. హైదరాబాద్ మెట్రో రైలులో ఆ బాలుడ్ని గుర్తించి పోలీసులకు అప్పగించారు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన 12 ఏళ్ల పరిణవ్ ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు వైట్‌ఫీల్డ్‌లోని డీన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ నుంచి పారిపోయాడు. మధ్యాహ్నం మూడు గంటలకు యెమ్లూర్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద కనిపించాడు. ఆ తర్వాత బెంగళూరులోని మెజెస్టిక్ బస్ టెర్మినస్‌లో సాయంత్రం బస్సు దిగడాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చివరగా గుర్తించారు.
కాగా, పరిణవ్ కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మిస్సింగ్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఇంటికి తిరిగి రావాలంటూ అతడి తల్లి సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆ బాలుడ్ని గుర్తించేందుకు పలువులు స్వచ్ఛందంగా ప్రయత్నించారు.
మరోవైపు పరిణవ్ తన వద్ద ఉన్న పార్కర్ పెన్నులను వందకు అమ్మాడు. ఆ బాలుడి వద్ద మరో వంద ఉన్నాయి. దీంతో బెంగళూరు నుంచి రైలులో మైసూరుకు అక్కడి నుంచి చెన్నై మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత బుధవారం ఉదయం మెట్రో రైలులో ప్రయాణించాడు.
కాగా, అదే మెట్రో రైలులో ప్రయాణించిన కర్ణాటకు చెందిన ఒక మహిళ పరిణవ్‌ను గుర్తించింది. ఆ బాలుడి మిస్సింగ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆమె దృష్టికి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో నాంపల్లి మెట్రో స్టేషన్ అధికారులు, పోలీసులకు ఆ బాలుడ్ని అప్పగించింది. ఈ విషయం తెలుసుకున్న పరిణవ్ తల్లిదండ్రులు తమ కుమారుడి కోసం హైదరాబాద్‌కు బయలుదేరారు. తమ కుమారుడి ఆచూకీ తెలుసుకునేందుకు సహకరించిన అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.