కోల్‌కతా: పరీక్షల్లో కొందరు విద్యార్థులు తమకు ఇష్టమైన దైవం పేరుతోనో, ఓం అక్షరాలతోనో సమాధానాలు రాయడం మొదలు పెడుతుంటారు. ఇంకొందరైతే సినిమా పాటలు రాయడం, మాకు ఫలానా ఇబ్బందులు ఉన్నాయి.. సరిగ్గా చదవలేదు, మమ్మల్ని పాస్ చేయండి అని రాయడం చూస్తూనే ఉంటాం. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఏకంగా అధికార పార్టీ నినాదం రాశారు.
పశ్చిమబెంగాల్లో పదో తరగతి పరీక్షలు మార్చి నెలలో ముగిశాయి. సమాధాన పత్రాలను దిద్దుతుండగా చాలా పేపర్లలో విద్యార్థులు అధికార టీఎంసీ నినాదమైన ‘ఖేలా హోబే’ (Khela Hobe.. ఆట ముందుంది) అని రాశారు. విస్తుపోయిన ఉపాధ్యాయులు విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి ఇలాంటి నినాదాలు రాసే విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులో జరుగనున్న 12 తరగతి పరీక్షల నుంచే దీనిని అమలు చేయాలని ఆదేశించారు.
పరీక్షల పేపర్లలో నినాదాలు రాయడం ఎగ్జామ్ రూల్స్‌కు విరుద్ధమని, అలాంటివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బెంగాల్లో 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష సమాధాన పత్రాల్లో ప్రశ్నలకు జవాబులు తప్ప మరే ఇతర రాతలు రాయకూడదని విద్యార్థులకు సూచించారు.