కోల్‌కతా, జూన్ 20: పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర గవర్నర్, అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు మధ్య రాజకీయ పోరు మరో స్థాయికి చేరుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ వద్ద మమతా బెనర్జీ సర్కార్ మోహరించిన కోల్‌కతా పోలీసుల నుంచి తన భద్రతకు ముప్పు పొంచివుందని ఆరోపించారు.
‘కోల్‌కతా పోలీసుల మోహరింపుతో నేను అభద్రతకు లోనవుతున్న విషయాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తెలియజేశాను. అయితే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. ప్రస్తుతం విధుల్లో ఉన్న పోలీస్ అధికారి, అతడి సిబ్బంది నుంచి నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందనేందుకు, నా కారణాలు నాకున్నాయి’ అని గవర్నర్ అన్నారు. గవర్నర్, రాజ్‌భవన్ అధికారుల కదలికలపై ప్రభుత్వం నిరంతరం నిఘా విధించిందని, పోలీసుల చర్యలు ప్రభుత్వం మద్దతుతో కొనసాగుతున్నాయని గవర్నర్ ఆరోపించారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నతాధికారులకు తెలియకుండా ఇదంతా జరగదు కదా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.