న్యూఢిల్లీ, జూన్ 30: పసిఫిక్ మహాసముద్రంపై ఎల్ నినో పరిస్థితులు బలపడుతున్నందున దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేస్తున్నది. దేశమంతటా జూలైలో వర్షపాతం సాధారణం కంటే తక్కువ ఉండే అవకాశం ఉందని మంగళవారం ఐఎండీ విడుదల చేసిన జూలై నెల వర్ష ముఖచిత్రం పేర్కొన్నది. వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 94% కంటే తక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. 1971 నుండి 2020 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా జూలై నెల ఎల్పీఏ 280.4 మి.మీ.గా ఉంది. ఐఎండీ అంచనా ప్రకారం మధ్య, పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని విస్తృత ప్రాంతాలతోసహా దేశంలోని చాలా భాగాలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రుతుపవనాల ప్రారంభం మందకొడిగా సాగినప్పటికీ ఈ వర్షాలు కొంత ఉపశమనాన్ని కలిగించనున్నాయి.
నైరుతి రుతుపవనాల మందగమనం వల్ల దేశంలోని చాలా ప్రాంతాలు జూన్లో ఎక్కువ భాగం తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కోవలసి వచ్చింది. దీని ఫలితంగా 1901 తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదైన నెలల జాబితాలో 2026 జూన్ ఐదవ స్థానంలో నిలిచింది. గత దశాబ్ద కాలంలోనే అత్యంత పొడిగా ఉన్న జూన్ నెలలలో ఒకటిగా ఇది నమోదైంది. జూన్ 1 నుంచి జూన్ 30 మధ్య దేశంలో సాధారణ వర్షపాతం 165.3 మి.మీ. కాగా 99.5 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైందని, దీని వల్ల మొత్తం వర్షపాతంలో లోటు ఏర్పడిందని భారత వాతావరణ శాఖ
(ఐఎండీ) మంగళవారం తెలిపింది. పొడి వాతావరణం ఇప్పటికే వ్యవసాయాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించింది.
నేలలో తేమ కొరత కారణంగా అనేక రాష్ర్టాలలో ఖరీఫ్ విత్తనాలు వేయడం తీవ్రంగా మందగించింది. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం మధ్య భారతదేశం. సాధారణ వర్షపాతం 170.3 మి.మీ. కాగా ఇక్కడ కేవలం 84.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. నెల ముగిసే సమయానికి 50 శాతం లోటు కనిపించింది.
వాయవ్య భారతదేశంలో 31% లోటు నమోదు కాగా దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో వర్షపాతం సాధారణం కంటే 27% తక్కువగా నమోదైంది. జూన్లో చాలా రాష్ర్టాల్లో ఆందోళనకర స్థాయిలో లోటు వర్షపాతం నమోదైంది. జూలై మొదటి వారం లో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడన వ్యవస్థలు ఏర్పడటం, రుతుపవన ద్రోణి దక్షిణ దిశగా కదలడం వల్ల మధ్య, పశ్చిమ, ఉత్తర భారతదేశంలో వర్షాలు పుంజుకుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. దీనివల్ల వర్షపాత లోటు తగ్గే అవకాశం ఉంది.