న్యూఢిల్లీ, నవంబర్ 15: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ రికార్డు స్థాయిలో 202 సీట్లు గెలుచుకోవడం, ప్రతిపక్ష మహాఘట్బంధన్(ఎంజీబీ) 35 స్థానాలకే పరిమితం కావడం ఆ రెండు కూటములను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తోంది. ఇవి మేము ఊహించని ఫలితాలు. కాంగ్రెస్ మాత్రమే కాదు బీహార్ ప్రజలు, మా కూటమి భాగస్వామ్య పక్షాలు సైతం నమ్మలేకపోతున్నాయి. ఓ పార్టీకి 90 శాతం విజయం దక్కడం ఎక్కడా జరగలేదు. బీహార్ నుంచి డాటా తెప్పించుకుని దీనిపై క్షుణ్ణంగా విశ్లేషణ చేస్తున్నాం అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అయితే కూటములను పక్కనపెడితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన చిన్న పార్టీలు తాము గెలుపొందనప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థుల జయాపజయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.
మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ(జేఎస్పీ), మాయావతికి చెందిన బీఎస్పీ, అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం వంటి చిన్న పార్టీలు ఎన్నికల ఫలితాలపై పెద్ద ప్రభావాన్నే చూపించాయి. మొదటిసారి పోటీ చేసిన జేఎస్పీ మొత్తం ఓట్లలో 3.4 శాతం ఓట్లు సాధించింది. ఒక్క స్థానంలో కూడా జేఎస్పీ గెలవనప్పటికీ రెండు కూటముల ఓట్లకు కత్తెరేసింది. ఎన్డీఏ, ఎంజీబీ రెండిటి ఓటు బ్యాంకుపై జేఎస్పీ కోత వేసింది. 33 సీట్లలో గెలిచిన అభ్యర్థి సాధించిన ఆధిక్యత కన్నా జేఎస్పీకి వచ్చిన ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇందులో 18 సీట్లలో ఎన్డీఏ, 13 సీట్లలో ఎంజీబీ గెలుపొందాయి. ఇక బీఎస్పీ విషయానికి వస్తే 181 సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ ఒకే ఒక స్థానంలో గెలుపొందింది. మరో సీట్లో రెండవ స్థానంలో నిలిచింది.
బీజేపీ బీ-టీమ్‌గా బీఎస్పీ పనిచేస్తోందంటూ ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తున్న ఇండియా కూటమి యూపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత తన ఆరోపణల తీవ్రతను ఉధృతం చేసింది. ఎన్డీఏ కన్నా బీఎస్పీ వల్లే ఎంజీబీకి ఎక్కువ నష్టం జరిగినట్లు బీహార్ ఫలితాలు సూచిస్తున్నాయి. 20 స్థానాలలో గెలిచిన అభ్యర్థి మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లను బీఎస్పీ సాధించింది. వీటిలో 18 సీట్లలో ఎన్డీఏ గెలుపొందగా కేవలం రెండు స్థానాలలో ఎంజీబీ విజయం సాధించింది. 90 శాతం సీట్లలో బీఎస్పీ పోటీ వల్ల ఎన్డీఏకే ఎక్కువ ప్రయోజనం కలిగిందనడానికి ఈ ఫలితాలే సాక్ష్యం. ఇక ఎంఐఎం విషయానికి వస్తే 2020 ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసుకుంటూ ఐదు స్థానాలలో గెలుపొందింది. ఒక చోట ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది.
‘సర్’ తర్వాత 3 లక్షల మంది పేర్లు చేర్చాం
ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ(సర్) చేపట్టి తుది జాబితా విడుదల చేసిన తర్వాత కూడా 3 లక్షల మంది పేర్లను బీహార్ ఓటర్ల జాబితాలో చేర్చినట్టు ఎన్నికల కమిషన్ తాజాగా వెల్లడించింది. ఇందువల్లే ‘సర్’ తర్వాత తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లుగా ఉండగా, అనంతరం అది 7.45 కోట్లకు పెరిగిందని ఈసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.