న్యూఢిల్లీ, మే 8 : పాకిస్థాన్ సరిహద్దు పోస్టుల వద్ద ప్రతి రోజూ సాయంత్రం నిర్వహించే ‘బీటింగ్ రిట్రీట్’ వేడుకలను నిలిపివేస్తున్నట్టు బీఎస్ఎఫ్ ప్రకటించింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్, పాకిస్థాన్, పీవోకేలోని 9 ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎస్ఎఫ్ తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అటారీ-వాఘా, హుస్సేన్వాలా, సాద్కీ సరిహద్దు పోస్టుల వద్ద ‘బీటింగ్ రిట్రీట్’ సహా ఎటువంటి ఉత్సవ ప్రదర్శనలూ ఉండవని, భద్రతను దృష్టిలో ఉంచుకొని అక్కడికి సాధారణ పౌరులెవ్వరినీ అనుమతించటం లేదని బీఎస్ఎఫ్ పేర్కొన్నది.