Supreme Court | ప్రజల భద్రతే ముఖ్యం తప్ప.. మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లు, రైల్వేట్రాక్‌లు ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు.. ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రజల భద్రత విషయంలో రాజీ ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదని వివరించింది. ఈమేరకు బుల్డోజర్ జస్టిస్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
న్యాయపరంగా అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా కూల్చివేతలను నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ‘మనది లౌకిక దేశం. మతం, వర్గాలకు అతీతంగా అందరికీ దిశ ఉంటుంది. మార్గమధ్యంలో ఏదైనా మతపరమైన నిర్మాణాలు ఉంటే.. అది గురుద్వారా అయినా.. దేవాలయమైనా కావొచ్చరు. అది ప్రజలను అడ్డుకోదు’ అని ధర్మాసనం పేర్కొంది. కూల్చివేతలకు సంబంధించిన నోటీసులు, ఉత్తర్వులు మరింత పారదర్శకంగా ఉండేలా డిజిటలైజ్ చేసి ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయవచ్చని కోర్టు చెప్పింది. పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వేలైన్లు, నీటి వనరుల ఆక్రమించిన ప్రాంతాల్లో కూల్చివేతలపై సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు అక్టోబర్ ఒకటి వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాల తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఒకటి, రెండు సంఘటన ఆధారంగా న్యాయస్థానం ఓ అంచనాకు రావొద్దని.. కూల్చివేతలపై మొదట నోటీసులు జారీ చేస్తున్నామని.. అక్రమ కట్టడాలని తేలాకే నోటీసులు జారీ చేసి కూల్చివేస్తున్నట్లు తెలిపారు. ఏదో ఒక ఘటన, ఓ వర్గం ఆరపణలతో కూల్చివేతలు అక్రమం అని భావించొద్దన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. మత విశ్వాసాలకన్నా ప్రజల భద్రతే ముఖ్యమని గతంలో పలు తీర్పుల్లోనూ స్పష్టం చేసినట్లుగా గుర్తు చేసింది. రోడ్లపై మతపరమైన కట్టడాలు తొలగింపును ధర్మాసనం సమర్థించింది.