న్యూఢిల్లీ: అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై (Coaching Centres) ఢిల్లీ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్నది. అనుమతి లేకుండా సెల్లార్లు, మేస్మెంట్లలో నడుస్తున్న పది కోచింగ్ సెంటర్లు, లైబ్రెరీలను మూసివేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) వాటిని సీజ్ చేసింది. అవి షాహ్దారా, కరోల్బాఘ్, నజఫ్‌గఢ్ జోన్లలో ఉన్నాయని ఢిల్లీ మేయర్ షెల్లీ ఓబెరాయ్ వెల్లడించారు. గత నెల భారీ వర్షాలకు ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లోకి భారీగా వరద పోటెత్తింది. దీంతో కోచింగ్ సెంటర్లోని సెల్లార్లో నిర్వహిస్తున్న లైబ్రరీలో చదువుకుంటున్నవారిలో ముగ్గురు విద్యార్థులు నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లను ఎంసీడీ మూసివేస్తున్నది.
తూర్పు ఢిల్లీలో ఎంసీడీ సీలింగ్ డ్రైవ్ కొనసాగుతున్నదని మేయర్ షెల్లీ ఓబెరాయ్ చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించాలని భావించే అన్ని కోచింగ్ సెంటర్లకు బుద్ధిచెప్పేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం..
ఢిల్లీలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి అతిషీ వెల్లడించిన విషయం తెలిసిందే. నగరంలోని పలు ప్రాంతాల్లో బేస్మెంట్లలో నిర్వహిస్తున్న 30 సివిల్స్ కోచింగ్ సెంటర్లను సీజ్ చేసినట్లు చెప్పారు. సుమారు 200 ఇన్స్టిట్యూట్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అధికారులు, విద్యార్థులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. డ్రైనేజ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అందువల్ల వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయిందన్నారు.