Baramati Plane Crash | మహారాష్ట్రలోని బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించి విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో శాటిలైట్ భద్రతా వ్యవస్థ “గగన్” లేకపోవచ్చని.. ఇది కూడా ప్రమాదానికి ఒక కారణమై ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రమాదానికి గురైన విమానంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమానం సుమారు 16 ఏళ్ల కిందటి లియర్‌జెట్ విమానం. ఇది భారత్‌లో 2021 జూన్ 2వ తేదీన రిజిస్ట్రేషన్ అయ్యింది. దానికి 28 రోజుల తర్వాత అంటే జూన్ చివరలో కొత్త నిబంధన వచ్చింది. ఆ నిబంధన ప్రకారం కొత్తగా రిజిస్టర్ అయ్యే అన్ని విమానాల్లో శాటిలైట్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ ( GAGAN) తప్పనిసరిగా ఉండాలి. కానీ అజిత్ ప్రయాణించిన విమానం ఆ గడువు కంటే 28 రోజుల ముందే రిజిస్టర్ అయ్యింది. దీంతో గగన్ నిబంధన ఈ విమానానికి ఆ నిబంధన వర్తించలేదు. చట్టపరంగా అన్ని ప్రమాణాలు పాటించినప్పటికీ.. సాంకేతికంగా ఇది ఆధునిక భద్రతా వ్యవస్థను కోల్పోయిందని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ దృశ్యమానత (విజిబిలిటీ) పరిస్థితుల్లోనూ ఈజీగా విమానాలను ల్యాండ్ చేసేందుకు గగన్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. సాధారణంగా పెద్ద విమానాశ్రయాల్లో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్) ఉంటుంది. ఇది నేలపై అమర్చిన పరికరాల ద్వారా తక్కువ విజిబిలిటీలోనూ పైలట్లకు ఖచ్చితమైన గైడెన్స్ ఇస్తుంది. ఈ వ్యవస్థ ఏర్పాటు చాలా ఖరీదైనది కావడంతో చిన్న, ప్రాంతీయ విమానాశ్రయాల్లో ఈ వ్యవస్థ చాలా వరకు అందుబాటులో ఉండదు. ఈ లోటును భర్తీ చేసేందుకే భారత్ గగన్ (GPS Aided Geo Augmented Navigation) వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది శాటిలైట్ ద్వారా విమానాలకు ల్యాండింగ్ గైడెన్ష్ అందిస్తుంది. అయితే దీనిని వినియోగించాలంటే విమానంలో కూడా ప్రత్యేక ఏవియానిక్స్ పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. అవి లేకపోతే గగన్ సిస్టమ్ ఉన్నా, దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
బారామతి ఎయిర్‌పోర్టు ఒక అన్‌కంట్రోల్డ్ ఎయిర్‌ఫీల్డ్. అంటే ఇక్కడ పూర్తిస్థాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉండదు. పైలట్లు స్థానిక ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థల నుంచి అందే సమాచారం ఆధారంగానే ల్యాండింగ్‌కు సిద్ధమవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎల్ఎస్ లేదా శాటిలైట్ గైడెన్స్ లేకపోతే పైలట్లు స్టెప్ డౌన్ అప్రోచ్ పద్ధతి అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను చీకట్లో మెట్ల మీద దిగడంతో పోలుస్తారు. ఇందులో మెట్లు దిగుతున్నట్లుగా ఒక్కో దశలో కిందకు దిగుతూ.. రన్ వే కనబడుతోందా లేదా అని చూసుకోవాలి. వాతావరణం బాగుంటే సమస్య ఉండదు. కానీ మబ్బులు, తక్కువ విజిబిలిటీ ఉంటే ప్రమాదం. ఒక్క విజువల్ సూచన తప్పినా ప్రమాదం తప్పదని విమాన భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు బుధవారం జరిగిన విమాన ప్రమాదానికి ముందు ల్యాండింగ్ కోసం ఇలాంటి ప్రయత్నమే చేశారు.
పుణె జిల్లా బారామతి విమానాశ్రయంలో బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే తక్కువ విజిబిలిటీ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. బారామతిలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఉదయం 8.10 గంటలకు పవార్ ముంబై నుంచి విమానంలో బయల్దేరారు. 8.30 గంటల సమయంలో విమానం ల్యాండ్ చేయడానికి పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే క్లియరెన్స్ కోసం బారామతి ఏటీసీ అధికారులను సంప్రదించారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో విజిబులిటీ చాలా తక్కువగా ఉండటంతో.. ‘రన్‌వే కనిపిస్తుందా? లేదా??’ అని పైలట్లను బారామతి ఏటీసీ అధికారులు అడిగారు. ఈ మేరకు పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏటీసీ ప్రశ్నకు.. కనిపించడంలేదని పైలట్లు సమాధానమిచ్చారు. దీంతో క్లియరెన్స్ రాలేదని, ఈ క్రమంలో విమానం గాల్లో కొంతసేపు చక్కర్లు కొట్టినట్టు మంత్రి వివరించారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో రన్‌వే కనిపిస్తుందా? అని ఏటీసీ అధికారుల ప్రశ్నకు పైలట్లు సానుకూలంగా స్పందించడంతో క్లియరెన్స్ ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 8.42 గంటల సమయంలో ల్యాండింగ్‌కు పైలట్లు ప్రయత్నించగా.. విజిబులిటీ సమస్యలతోపాటు నియంత్రణ కోల్పోవడంతో రన్‌వేకు దగ్గరగా ఉన్న ఓ బండరాయికి ఢీకొని 8.48గంటల ప్రాంతంలో పెద్ద మంటతో విమానం కూలిపోయినట్టు సమాచారం.