Supreme Court : లా విద్యార్థులపై చర్యలు తీసుకునే చట్టబద్ధమైన అధికారం బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారు విద్యార్థులు అని, వారంతా సంబంధిత యూనివర్సిటీలు, విద్యా సంస్థల పరిధిలోని వస్తారని వెల్లడించింది. ఇటీవల నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల అంశంలో చెలరేగిన వివాదంపై విచారణ సందర్భంగా కోర్టు తాజా సూచనలు చేసింది.
హైదారాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో 2026 లా గ్రాడ్యుయేట్ విద్యార్థుల స్నాతకోత్సవం జరగాల్సి ఉంది. దీనికి సీజేఐ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అయితే, ఆయనను చీఫ్ గెస్టుగా రావడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. దీంతో కార్యక్రమం రద్దైంది. ఆ తర్వాత బెంగళూరు లా విద్యార్థులు కూడా ఇలాగే చేశారు. అయితే, నల్సార్ విద్యార్థుల వైఖరిపై బీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విద్యార్థుల్ని ఎన్రోల్ చేయకూడదని లాయర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విద్యార్థులు, న్యాయ కోవిదుల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే ఆ నిర్ణయాన్ని బీసీఐ వెనక్కు తీసుకుంది.
అయితే, సీజేఐ రాకను అడ్డుకున్న లా విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. విద్యార్థులపై చర్యలు తీసుకునే చట్టబద్ధమైన హక్కు బీసీఐకి లేదా రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు లేదని వివరించింది. వారు విద్యార్థులు అని, వారిపై చర్యలు తీసుకునే హక్కు సంబందిత యూనివర్సిటీలకే ఉంటుందని పేర్కొంది. ఒకవేళ వారు అడ్వకేట్లుగా ఎన్రోల్ అయితే, అప్పుడు వారిపై చర్యలు తీసుకునేందుకు బీసీఐకి హక్కు ఉంటుందని వెల్లడించింది.