న్యూఢిల్లీ, ఆగస్టు 6: బంగ్లాదేశ్‌లో సంక్షోభం వెనుక పాకిస్థాన్, చైనా పాత్ర ఉందని బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. షేక్ హసీనాను గద్దె దించి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)ని అధికారంలోకి తేవడానికి ఐఎస్ఐ సహకారంతో లండన్‌లో ప్రణాళిక రచించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు బీఎన్పీ అధ్యక్షురాలు ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఐఎస్ఐ అధికారులను కలిసినట్టు ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. గత కొన్ని రోజులుగా బంగ్లాలో అల్లర్లను ప్రేరేపించేలా, షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పాకిస్థాన్‌కు చెందిన అకౌంట్ల నుంచి పోస్టులు పెడుతున్నట్టు గుర్తించారు. బంగ్లాలో ఆందోళనలను ప్రేరేపించడంలో ఐఎస్ఐ ద్వారా చైనా కూడా కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారు. ఆందోళనల్లో కీలకంగా వ్యవహరించిన జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్‌కు చెందిన విద్యార్థి విభాగం ఇస్లామీ ఛత్ర శిబిర్(ఐసీఎస్) వెనుక ఐఎస్ఐ ఉందని అనుమానిస్తున్నారు. కాగా, షేక్ హసీనా భారత్ అనుకూల వ్యక్తిగా గుర్తింపు పొందగా, ఖలీదా జియా మాత్రం చైనా, పాక్‌కు అనుకూలంగా ఉంటారనే పేరుంది.
హిందూ కవి పాటనే బంగ్లా నిరసనకారులకు స్ఫూర్తి
ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలై, ప్రధానిని గద్దె దింపే వరకు కొనసాగిన నిరసనలకు ఒక హిందూ కవి రాసిన పాట కూడా స్ఫూర్తి నింపింది. దేశవిభజనకు ముందు బెంగాల్ గొప్పతనాన్ని, ఆ ప్రాంత వైభవాన్ని వర్ణిస్తూ ప్రముఖ బెంగాలీ కవి ద్విజేంద్రలాల్(డీఎల్) రాయ్ ‘ధన ధాన్య పుష్ప భార’ అనే పాటను రాశారు. జూలై 16 నుంచి బంగ్లాదేశ్‌లో మొదలైన ఆందోళనల్లో నిరసనకారులు ఈ పాటను ఆలపిస్తూ, వింటూ పాల్గొన్నారు. కాగా, ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో 1863 జూలై 19న డీఎల్ రాయ్ జన్మించారు. ఆయన రచించిన పాటలను ‘ద్విజేంద్రగీతి’గా పిలుస్తారు.