ముంబై: బీజేపీ పాలిత మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాల్ఘర్ జిల్లా, వాసాయ్ సమీపంలో పన్నెండేళ్ల బంగ్లాదేశీ బాలికపై మూడు నెలలకు పైగా సుమారు 200 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులు రెండు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు బాధితురాలికి వ్యభిచార ముఠా నుంచి విముక్తి కల్పించారు. ఈ బాలిక ఓ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అవడంతో తల్లిదండ్రులకు భయపడి, ఇంటి నుంచి పారిపోయిందని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి తెలిపారు. తనకు తెలిసిన ఓ మహిళ వద్దకు వెళ్లగా, ఆ మహిళ ఆ బాలికను రహస్యంగా భారత దేశానికి తీసుకొచ్చిందని, వ్యభిచారంలోకి దించిందని చెప్పారు. ఆమెకు జూలై 26న విముక్తి కల్పించారు. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేయాలని స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేశాయి.
ఒడిశాలో మరో బాలిక ఆత్మాహుతి ; సమయానికి రాని ఆంబులెన్స్
భువనేశ్వర్, ఆగస్టు 11: బీజేపీ పాలిత ఒడిశాలో యువతులు, బాలికల ఆత్మాహుతి ఘటనలు కలకలం రేపుతున్నాయి. బాలాసోర్ తరహా ఘటన తాజాగా మరొకటి చోటుచేసుకుంది. సోమవారం గైసిలాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిరింజ్మాల్ గ్రామానికి చెందిన 13 ఏండ్ల బాలిక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఘటనపై పోలీసులు వెంటనే స్పందించలేదని, అంబులెన్స్ రావడానికి 45 నిమిషాలపైన సమయం పట్టిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్లో కాలిన గాయాలతో పడివున్న బాలికను గ్రామస్థులు దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ‘మృతురాలు 8వ తరగతి చదువుతున్న బాలిక. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు గల కారణాలు తెలియదు’ అని పోలీసులు తెలిపారు. బాలిక ఆత్మహత్య వెనుక కుట్రపూరిత కోణం ఏదైనా ఉందా? అని తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది నాలుగోసారి.