న్యూఢిల్లీ: మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఇవాళ బంగ్లాదేశ్(Bangladesh) తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు లేఖను రాసింది. 77 ఏళ్ల హసీనా.. గత ఆగస్టు 5వ తేదీ నుంచి ఇండియాలోనే నివసిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో.. హసీనా దేశం విడిచి వెళ్లారు. ఢాకాకు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్.. షేక్ హసీనాతో పాటు ఆమె మంత్రులకు, సలహాదారులకు, మాజీ మిలిటరీ అధికారులకు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
హసీనా ప్రభుత్వాధికారులు ఊచకోతకు పాల్పడినట్లు ఆ లేఖలో ఆరోపించారు. షేక్ హసీనాపై న్యాయవిచారణ చేపట్టేందుకు ఆమెను ఢాకాకు పంపాలని భారత్‌ను దౌత్యపరంగా అభ్యర్థించినట్లు తాత్కాలిక ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు.
హసీనా అప్పగింతకు చెందిన లేఖను ఢాకాలో ఉన్న విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించినట్లు హోం అడ్వైజర్ జహంగిర్ ఆలమ్ తెలిపారు.