న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా మోదీ (PM Modi) మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 8 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాలకు చెందిన తరలిరానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా రణిల్ విక్రమసింఘేను ప్రధాని మోదీ ఆహ్వానించారని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. వీరితోపాటు భూటాన్, నేపాల్, పారిషస్ దేశాధినేతలను కూడా ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు తెలుస్తున్నది.
2019లో జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్లాండ్ కూటమి అయిన బిమ్స్టెక్కు చెందిన నేతలు హాజరయ్యారు. మొత్తంగా తొమ్మిది వేల మంది అతిథులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఎన్డీయే కూటమి నేతగా మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 8న వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు తమ కూటమి నేతగా నరేంద్రమోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 7న ఎన్డీయే ఎంపీలు సమావేశమై తమ నేతగా మోదీని అధికారికంగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిసి ఈ మేరకు లేఖలు అందించనున్నట్టు హెచ్ఏఎం(సెక్యులర్) నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఈ సమావేశం తర్వాత తెలిపారు.