Advisory | బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ నిరసనలతో బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత మంగళవారం ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో వంద మంది గాయపడ్డారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితుల నేపథ్యంలో భారత హైకమిషన్ బంగ్లాదేశ్‌లో ఉంటున్న భారతీయ పరులు, విద్యార్థులకు అడ్వైజరీని జారీ చేసింది. ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో అవనసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని.. వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూసించింది. ఈ సందర్భంగా చిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నాలో పౌరులు, విద్యార్థుల కోసం అత్యవసర నంబర్లను జారీ చేశాయి.
ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలను మూసివేయాలని బంగ్లా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకున్నది. ఆ తర్వాత ఢాకాలో విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాల్లోని విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో వర్తించే కోటా విధానంలో సంస్కరణలను తేవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత రిజర్వేషన్ విధానంతో ప్రతిభ ఉన్న విద్యార్థులకు నష్టం జరుగుతుందంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఫస్ట్, సెకండ్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత రిజర్వేషన్ విధానాన్ని సవరించిన అనంతరం.. ప్రతిభ ఆధారంగా సీట్లు భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలు, మనవళ్లకు 30 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో గురువారం ఢాకాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు తీవ్రమయ్యాయి. బీఆర్ఏసీ యూనివర్సిటీ సమీపంలోని మేరుల్ బద్దాలో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో చెలరేగిన హింసలో పలువురు గాయపడ్డారు. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. మరో వైపు నిరసనల మధ్య అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. నిరసనల ముసుగులో ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టి వారి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయని అధికార పక్షం ఆరోపిస్తున్నది.