న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు 700 కిలోమీటర్ల మేరకు వ్యాపించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణులకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చి 100 మీటర్ల ఎత్తు ఉన్నవి మాత్రమే ఆరావళి పర్వతాల పరిధిలోకి వస్తాయని ప్రకటించిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో దిగివచ్చింది. ఆరావళి పర్వతాలను మైనింగ్ చెరపట్టేందుకే ప్రభుత్వం ఈ కొత్త నిబంధన తీసుకువచ్చిందంటూ ప్రజాసంఘాల నుంచి విపక్షాల వరకు గుప్పిస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆరావళి పర్వత శ్రేణుల వ్యాప్తంగా కొత్త మైనింగ్ లీజుల మంజూరుపై సంపూర్ణ నిషేధం విధించాలని సంబంధిత రాష్ర్టాలను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ బుధవారం ఆదేశించింది. ఆరావళి పర్వత శ్రేణుల వ్యాప్తంగా ఈ నిషేధం ఒకేవిధంగా వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. చట్టవ్యతిరేక, అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిర్మూలించి పర్యవరణానికి రక్షణ కవచంగా ఉపయోగపడే పర్వత శ్రేణుల సమగ్రతను పరిరక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా..
మైనింగ్‌ని ఎక్కడ నిషేధించాల్సిన అవసరం ఉందో ఆరావళి వ్యాప్తంగా అదనపు ప్రదేశాలను గుర్తించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎఫ్ఆర్ఈ)ని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే మంజూరైన మైనింగ్ లీజుల విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ చర్యలను కఠినంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై అదనపు ఆంక్షలు విధించి సుస్థిరమైన మైనింగ్ పద్ధతులను పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలను కేంద్రం కోరింది.
విస్తృత మైనింగ్‌కు తలుపులు తెరిచే లక్ష్యంతోనే ఆరావళికి సంబంధించి కేంద్రం మార్పులు తీసుకువచ్చిందన్న ఆరోపణలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఖండించిన రెండు రోజులకే కేంద్రం నుంచి తాజా ఆదేశాలు వెలువడడం విశేషం. స్థానిక నైసర్గిక స్వరూపం, జీవవైవిధ్యం, పర్యావరణ సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తమ తాజా ఆదేశాలు ఆరావళిలోని మరిన్ని ప్రాంతాలు మైనింగ్ నుంచి రక్షణ పొందుతాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఎడారీకరణ నివారణ, జీవవైవిధ్య పరిరక్షణ, భూగర్భ జలాల రీచార్జింగ్, ప్రాంతానికి అత్యవసరమైన పర్యావరణ సేవలు అందచేయడంలో ఆరావళి పర్వత శ్రేణులు పోషిస్తున్న కీలక పాత్రను గుర్తించి ఈ పర్వతాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది.
కమిటీ కాదన్నా సుప్రీం ఓకే!
ఆరావళి పర్వత శ్రేణులకు 100 మీటర్ల నిర్వచనం ఇస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనను సుప్రీంకోర్టు ఆమోదించగా అత్యున్నత న్యాయస్థానం తానే స్వయంగా నియమించిన కమిటీ ఈ నిబంధనను వ్యతిరేకించిన విషయం తాజాగా వెలుగుచూసింది. ఈ ఏడాది అక్టోబర్ 13న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ ఆరావళి పర్వతాలకు కొత్తగా 100 మీటర్ల నిర్వచనాన్ని సుప్రీంకోర్టు వద్ద ప్రతిపాదించింది. మరుసటి రోజే సుప్రీంకోర్టుకు చెందిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) తాము ఈ ప్రతిపాదనను అధ్యయనం చేయలేదని లేదా దీన్ని ఆమోదించలేదని ఈ కేసులో సుప్రీంకోర్టుకు సహాయపడుతున్న అమికస్ క్యూరీకి లిఖితపూర్వకంగా తెలియచేసింది. మంత్రిత్వశాఖ అందచేసిన 100 మీటర్ల నిబంధన సిఫార్సును సుప్రీంకోర్టు నవంబర్ 20న ఆమోదించింది.