న్యూఢిల్లీ : నూకల బియ్యం ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చిందని విదేశీ వాణిజ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఓ నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. నిల్వలు పెరుగుతున్నందున ఎగుమతులకు అనుమతించాలని అంతకుముందు ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబరులో ఈ నిషేధాన్ని విధించింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధర నిబంధనను గత ఏడాది ప్రభుత్వం తొలగించింది. ఈ రకం బియ్యం ఎగుమతులపై గంపగుత్తగా విధించిన నిషేధాన్ని ఉపసంహరించింది. ప్రభుత్వ గోదాముల్లో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉండటంతోపాటు రిటైల్ ధరలు నియంత్రణలో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకుంది.